ఈ సంగతి ఇప్పుడు తెలిసిందా?

 

ఈ సంగతి ఇప్పుడు తెలిసిందా?

ప్రజలకు కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

 

ఖర్గేజీ.. గ్యారెంటీలతో మొదటికే మోసమని ఇప్పుడర్థమైందా?

 

గాలి హామీలిస్తే ఆర్థిక సంక్షోభమేనని ఇప్పుడు బోధపడిందా?

 

తెలంగాణలో తప్పు చేస్తున్నప్పుడు గుర్తు రాలేదు ఎందుకు?

 

 

ఈ పతనం నుంచి కోలుకోవడం ఇక అసాధ్యమే: కేటీఆర్‌

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ఆడిన గ్యారెంటీల గారడీతో తెలంగాణ ఏడాదిలోనే ఆగమైంది.. ప్రజలను నమ్మించి నయవంచన చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.

 

ఎన్నికల్లో ఆచరణ సాధ్యంకాని గ్యారెంటీలను ప్రకటించి ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. గాలిమాటల గ్యారెంటీలతో మొదటికే మోసం వస్తుందన్న విషయం కాంగ్రెస్‌ నేతలకు ఇప్పుడు అర్థమయిందా? అంటూ దుయ్యబట్టారు. గ్యారెంటీల మాటున తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ చేసిన మోసం క్షమించలేనిదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు కర్ణాటక గ్యారెంటీలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఎక్స్‌ వేదికగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్‌ సరిపోదని, వాటిని అమలు చేస్తే ఆర్థిక సంక్షోభం వస్తుందని మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకుంటే మొదటికే మోసం వస్తుందని నిప్పులు చెరిగారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్‌ గుర్తు రాలేదా? అని ఆరు గ్యారెంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్‌ గురించి తెలియదా? అని నిలదీశారు. అనాలోచితంగా ఇచ్చే కాంగ్రెస్‌ గ్యారెంటీలతో భవిష్యత్తు తరాలకు నష్టం జరుగుతుందని ఇప్పటికైనా మల్లికార్జున ఖర్గే గుర్తించినందుకు సంతోషమని పేర్కొన్నారు.