సంగాయిపల్లి తండాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దే: పైలెట్ రోహిత్ రెడ్డి
యాలాల: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ యాలాల మండలం సంగాయిపల్లి తండాలో బీఆర్ఎస్ నాయకులు, తండావాసులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని తండావాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అలాగే తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించిందని పేర్కొన్నారు.గిరిజన విద్యార్థుల కోసం గురుకులాల ఏర్పాటు, విద్యా–ఉద్యోగ అవకాశాల కల్పన, గిరిజనుల కోసం ఇళ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందని ఆయన వివరించారు. గిరిజనుల అభ్యున్నతికి చేపట్టిన పలు కార్యక్రమాల కారణంగా కేసీఆర్‌ను గిరిజన బాంధవుడిగా తండావాసులు గుర్తిస్తున్నారని అన్నారు.

