కల్యాణలక్ష్మి ఆగదు.. ఆపబోము!

కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకం యథావిధిగా కొనసాగుతుంది
పేదల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది: కలాల్ చంద్రశేఖర్ గౌడ్

వికారాబాద్:manasa news ప్రతినిధి :కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేస్తున్నారంటూ కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకుడు కలాల్ చంద్రశేఖర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకం యథావిధిగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. పథకం రద్దు అవుతుందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.  గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి నిధులు అందించే ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. పారదర్శకత, జవాబుదారీతనంతో సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.  ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని చెప్పారు. పేదల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.  కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలపై ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలతో బలమైన కౌంటర్ దాఖలు చేసిందని, పేదల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.  తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కుల, మత, పార్టీ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కులను అందజేస్తున్నారని తెలిపారు. అలాగే వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కొడంగల్ ఇన్‌చార్జి తిరుపతి రెడ్డి తదితరులు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు .రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని, ఇదే ప్రజా ప్రభుత్వ పాలనా విధానమని కలాల్ చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని ఆయన కోరారు. “కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకం ఆగదు.. ఆపబోము. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని కలాల్ చంద్రశేఖర్ గౌడ్ స్పష్టం చేశారు.