ఖర్గే ఘటనపై కాంగ్రెస్ ఫైర్!

వేదిక శుద్ధిపై దుమారం.. బీజేపీపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు
అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలి: గోపాల్
ఖర్గేకు అవమానం కాదు.. రాజ్యాంగానికే అవమానం: కె. గోపాల్
వికారాబాద్ జిల్లా: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభ అనంతరం వేదికను గంగాజలంతో శుద్ధి చేశారనే ఘటనను వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అడ్వకేట్ కె. గోపాల్ తీవ్రంగా ఖండించారు.
ఈ ఘటన ఒక వ్యక్తిని అవమానించడం మాత్రమే కాదని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకటించిన సమానత్వం, సామాజిక న్యాయం, గౌరవం వంటి విలువలను అవమానించే చర్యగా కాంగ్రెస్ భావిస్తోందన్నారు. అందరికీ సమాన గౌరవం కల్పించడమే రాజ్యాంగ స్ఫూర్తి అని, ఇలాంటి చర్యలు సమాజంలో విభజన భావాలను పెంచుతాయని పేర్కొన్నారు.
అంబేద్కర్ చిత్రాలకు పూలమాలలు వేయడం మాత్రమే కాకుండా, ఆయన రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరణలో గౌరవించాలని గోపాల్ సూచించారు. మతం, కులం పేరుతో ప్రజలను విభజించే రాజకీయాలను విడనాడాలని, నిరుద్యోగం, రైతుల సమస్యలు, ధరల పెరుగుదల వంటి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.భారతదేశం మనుస్మృతి మీద కాకుండా అంబేద్కర్ రాజ్యాంగం ఆధారంగా నడుస్తోందని, రాజ్యాంగ గౌరవాన్ని కాపాడటం ప్రతి ప్రజాస్వామ్యవాది బాధ్యత అని ఆయన అన్నారు.
– అడ్వకేట్ కె. గోపాల్
అధికార ప్రతినిధి, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ