ఆర్ఎంపి డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తాం :
పట్నం మహేందర్ రెడ్డి
హైదరాబాద్ :అగ్నిజ్వల ప్రతినిధి
ఆర్ఎంపి డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు ఇతరుల ద్వారా వేధింపులు జరగకుండా చూస్తామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం సాయంత్రం తాండూర్ లోని ఆయన నివాసంలో తాండూర్, బషీరాబాద్, యాలాల్, పెద్దేముల్, కోట్పల్లి తదితర మండలాలకు చెందిన ఆర్.ఎం.పి డాక్టర్లు మహేందర్ రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు.
ఇటీవల తమపై ఆరోగ్య శాఖ అధికారుల దాడులు పెరిగాయని, అకారణంగా కేసులు నమోదు చేస్తున్నారని విన్నవించారు. తమపై పెడుతున్న కేసులను ఎత్తివేయాలని వారు కోరారు.
దీంతో స్పందించిన మహేందర్ రెడ్డి ఉన్నతాధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.
వాస్తవానికి గ్రామీణ ప్రాంతాలలో గతంలో కరోనా పరిస్థితిలో ఆర్ఎంపీ డాక్టర్లు చేసిన సేవ లు ప్రశంసనీయమని ఆయన అన్నారు.
ఇతరత్రా విషయాలను పట్టించుకోకుండా గ్రామీణ పేద ప్రజలకు సేవ చేయాలని పేర్కొంటూ ఆర్ఎంపీలపై జరుగుతున్న దాడులను నివారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీనియర్ నాయకుడు కరణం పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు.