వెయ్యి రోజుల పాలనలో తాండూరు అభివృద్ధికి రూ.1,200 కోట్లు
ఉత్తుత్తి జీవోలు కాదు.. అక్షర సత్యాలు – కాంగ్రెస్ నాయకులు
తాండూరు: manasa news : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రోజుల పాలనలో తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.1,200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు. ఉత్తుత్తి జీవోలు చూపించడం కాదని, చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలు, ఆధారాలను ప్రజాక్షేత్రంలో ఉంచుతున్నామని స్పష్టం చేశారు.తాండూరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిపూర్ బాల్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి కే. గోపాల్, వసీం, ఓల్డ్ తాండూరు కౌన్సిలర్ ఎల్లప్ప మాట్లాడారు.
ఈ సందర్భంగా వెయ్యి రోజుల పాలనలో తాండూరులో రూ.1,200 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో రూపొందించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ బ్రోచర్‌ను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తున్నామని, దీనిపై విస్తృతంగా చర్చ జరగాలని వారు కోరారు. అభివృద్ధి విషయంలో తాము చెబుతున్న విషయాలు అవాస్తవమైతే ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ చేశారు.తాండూరు ప్రజలు ఇకపై రెచ్చగొట్టే రాజకీయాలు, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసే రాజకీయాలను కోరుకోవడం లేదని, అభివృద్ధి, ఆదర్శవంతమైన రాజకీయాలు కావాలని కోరుకుంటున్నారని నాయకులు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలనే ఆలోచన కాకుండా.. వచ్చే తరాల భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.అలాంటి రాజనీతిజ్ఞతకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి ముఖ్యమైనదే అయినప్పటికీ, తాండూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే సత్తా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఉందని అన్నారు.గత ఐదేళ్ల కాలంలో తాండూరు అభివృద్ధికి అవసరమైన నిధులు ఎందుకు విడుదల కాలేదని, విడుదలైన నిధులు ఎక్కడికి వెళ్లాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వెయ్యి రోజులుగా తాండూరు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. తాండూరు అభివృద్ధిపై ప్రజాక్షేత్రంలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, అభివృద్ధి పనుల వివరాలను ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు.మన తాండూరు.. మన అభివృద్ధి” అనే లక్ష్యంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని వారు తెలిపారు.

