తాండూరు: manasa news : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. గురువారం తాండూరు మండలం గౌతపూర్ గ్రామంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. “వంద రోజులన్నారు.. వెయ్యి రోజులైంది.. కానీ ప్రజలకు ఇచ్చిన హామీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది” అని అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, యూరియా పంపిణీ విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఎన్నికల సమయంలో రైతులకు రూ.15 వేల రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. పంటలకు బోనస్ విషయంలో స్పష్టత లేకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారని, యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.వృద్ధులు, దివ్యాంగులకు పెంచుతామని హామీ ఇచ్చిన పెన్షన్లు కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విషయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై గ్రామగ్రామాన ప్రజల్లో చర్చ జరగాలని పైలట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగడం సరికాదన్నారు.
వంద రోజులన్నారు.. వెయ్యి రోజులైంది
